👉 రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల హాజరుపై తనిఖీలు చేయాలని ఇప్పటికే జిల్లాలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులపై నిఘా కోసం ఆయా జిల్లాలో చెకింగ్ టీమ్స్ ఏర్పాటయ్యాయి.
👉 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఫ్లయింగ్ స్వ్కాడ్లు తమకు కేటాయించిన ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. హాజరుతో పాటు పని విధానాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
👉 ఆయా అంశాలను పరిశీలించి ప్రత్యేక బృందాలు నివేదికను రూపొందిస్తాయని సమాచారం. ఇవి జిల్లా కలెక్టర్లకు చేరనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ తీసుకువచ్చిన ముఖ హాజరు విధానాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
👉 హాజరు నమోదులో ఆలస్యమైతే జీతం కట్ చేస్తారనే వార్తలపై కూడా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
👉 గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి పెరిగి ఆందోళన చెందుతున్నారని వారికి టార్గెట్లు పెట్టి, జీతాల్లో కోతలు విధిస్తున్నారని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని వాటిని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
👉 మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో జవాబుదారీతనం కోసం ఈ మధ్యే మరో నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
👉 ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, వారి విధులు, వారికి ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలతో కూడిన బోర్డుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
👉 ఆయా కార్యాలయాల్లో ఎవరెంత జీతం తీసుకుంటున్నారో కూడా బోర్డులపై వెల్లడించనుంది. ఈ నిర్ణయంపై కసరత్తు చేస్తుండటంతో ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
👉 ఈ నేపథ్యంలో తాజాగా ఫ్లయింగ్ స్క్వాడ్ ల వ్యవస్థను తీసుకువస్తుండటంతో ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
👉 అయితే ప్రభుత్వం మాత్రం పని చేయని ఉద్యోగులకు చెక్ పెట్టాలని సీరియస్ గా భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వ్యవస్థల పనితీరులో మరిన్ని మార్పులు తీసుకురావాలని గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
👉 అన్ని ప్రభుత్వ శాఖల్లోను ఈ వ్యవస్థను పట్టాలెక్కించారు. జనవరి 2వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తప్పనిసరి చేశారు.
👉 ఉద్యోగులు యాప్లను డౌన్లోడ్ చేసుకుని అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులతో పాటు డీడీఓలకు యాప్ వినియోగంపై మార్గదర్శాలు ఇప్పటికే జారీ అయ్యాయి.
👉 ఇదిలా ఉండగానే... ఏపీ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో ఉద్యోగులుంటున్నారా? లేదా..? ఉద్యోగుల పని విధానం, హాజరుపై ఆకస్మికంగా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తోంది.